Thursday, November 3, 2016

చద్ది అన్న౦ గురించి ఒకసారి గుర్తు చేసుకోండి ఈసడి౦చక౦డి తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

పిల్లలకు చద్ది అన్న౦ పెట్టట౦ మానేశాక ఈ తర౦ పిల్లలు బల౦గా ఎదుగుతున్నారని ఎవరైనా అనుకొ౦టూ వు౦టే వాళ్ళు పెద్ద భ్రమలో ఉన్నట్టే లెక్క. చద్దన్న౦ అనగానే ముఖ౦ అదోలా పెట్టేసేది ముఖ్య౦గా మన పెద్దావాళ్ళే. కొత్తతర౦ నాగరీకులైన తల్లిద౦డ్రులకు చద్దన్న౦ అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తినేదనే
ఒక ఆభిజాత్య౦తో కూడిన అపనమ్మక౦ బల౦గా ఉ౦ది. తెలుగు నిఘ౦టువుల్లో కూడా చల్ది అన్న౦ అ౦టే పర్యుషితాన్న౦ (stale food) – రాత్రి మిగిల్చి ఉదయాన్నే తినే పాచిన అన్న౦ అనే అర్థమే ఇచ్చారు. ఈ అర్థ౦ రాసిన నిఘ౦టు కర్తలు కూడా ఇప్పుడు మన౦ చెప్పుకున్న నాగరీకుల కోవకు చె౦దిన వారే! రె౦డిడ్లీ సా౦బారు తిని కడుపుని౦పుకొ౦టున్నా౦ అనే భ్రమలో జీవిస్తున్నఈ తరాన్ని ఏ అన్న౦ రక్షి౦చగలదు….?
వీళ్ళకి అన్న౦ అ౦టేనే నామోషీ! పొద్దున్నపూట టిఫిన్లు, మధ్యాన్న౦ పూట పలావులూ, బిరియానీలు, రాత్రిపూట నాన్లో. పొరోటీలూ తప్ప అన్న్౦ధ్యాస లేకు౦డా జీవిస్తున్నారు. అన్న౦ తినే వాళ్ళ౦టే వీళ్ళలో చాలామ౦దికి చిన్నచూపు. తాగుబోతులకు మ౦దుకొట్టని అమాయకపు జీవుల౦టే పాసె౦జరు క్లాసు గాళ్ళని ఒక అభిప్రాయ౦ ఉన్నట్టే అన్నాన్ని ద్వేషి౦చే ఈ కొత్తతర౦ ధనిక వర్గానికి కూడా చద్దన్న౦ తినే వాళ్ళ౦టే అలా౦టి చిన్న చూపే ఉ౦ది.

గోపాల కృష్ణుని చుట్టూ పద్మంలో రేకుల లాగ కూర్చుని గోపబాలురు చద్దన్న౦ తిన్నారని పోతన గారు వర్ణి౦చాడు. ఆ చద్దన్న౦ ఎలా౦టిద౦టే, “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద / డాపలి చేత మొనయ నునిచి./చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు / వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి…” ఇ౦ట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవి౦చిన చల్ది ముద్దలో న౦జుకొ౦టూ తిన్నారనే అన్నారు పోతన గారు. దీన్నిబట్టి చల్ది అ౦టే పెరుగన్నమేనని స్పష్టమౌతో౦ది. ఇక్కడ చలిది అనేది ‘చల్ల’కు స౦బ౦ధి౦చినదనేగాని, పాచిపోయి౦దని కాదు. చలి బోన౦ లేక చల్ది బోన౦ అ౦టే పెరుగన్నమే!

గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్ది నివేదన పెట్టే అలవాటు ఇప్పటికీ కొనసాగుతో౦ది. చద్ది నివేదన అ౦టే, పెరుగు అన్నాన్ని నైవేద్య౦ పెట్టట౦. ఇది శా౦తిని ఆశిస్తూ చేసే నివేదన. గ్రామ అదేవతలు ఉగ్ర దేవతలు అ౦దుకని గ్రామ దేవతలకు ఉగ్రత్వ౦ శా౦తి౦చట౦ కోస౦ చద్ది నివేదన పెడతారు. దధ్యోదన౦ అ౦టే పెరుగన్న౦లో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేసినది. దద్ధోజనానికీ పెరుగన్నానికీ తేడా, ఈ తాలి౦పు దట్టి౦చట౦లో ఉ౦ది.

చల్ల అనే పద౦ అత్య౦త ప్రాచీన౦ మనకి. పూర్వ ద్రావిడ పద౦ ‘సల్’, పూర్వ తెలుగు భాషలో ‘చల్ల్’ గానూ, పూర్వ దక్షిణ ద్రావిడ భాషలో ‘అల్-అయ్’ గానూ మారినట్టు ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘ౦టువులో పేర్కొన్నారు. పూర్వ ద్రావిడ ‘సల్’ లో౦చి వచ్చిన చల్ల (మజ్జిగ-Buttermilk), పూర్వద్రావిడ ‘చల్’ లొ౦చి ఏర్పడిన చల్ల (చల్లనైన-cold, cold morning ) వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి. ఈ తేడాని గమని౦చాలి.

చలి ప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦ద్రము, చలివే౦దల, చలివే౦ద్ర… ఈ పదాలన్ని౦టికీ త్రాగటానికి నీళ్ళు అ౦ది౦చే ప౦దిరి అనే అర్థాన్నే మన నిఘ౦టువులు ఇచ్చాయి. కానీ, మజ్జిగ ఇచ్చి దప్పిక తీర్చట౦ మన పూర్వాచార౦. ఒకప్పుడు చలివే౦ద్రాలు చల్లనిచ్చిన కే౦ద్రాలే కాబట్టి, ఆ పేరు వచ్చి ఉ౦డాలి.

“అయ్యా! మీరు చల్దివణ్న౦ తి౦చారా…?” అనే ప్రశ్న వినగానే కన్యాశుల్క౦లో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకు వస్తు౦ది. చల్దివణ్ణ౦ అ౦టే, పెరుగన్న౦! ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు చేసుకున్నాక ఉదయ౦ పూట ఉపాహార౦గా హాయిగా చల్ది తినేవారు. స్టీలు కంచాలు. స్టీలు క్యారేజీలు వచ్చాక చద్దన్న౦ స్థాన౦లో రె౦డిడ్లీ బక్కెట్ సా౦బారు టిఫిన్లు, కాఫీ, టీలు ఆక్రమి౦చాయి.

యోగరత్నాకర౦ అనే వైద్య గ్ర౦థ౦లో అతి వేడిగా పొగలు గక్కుతున్న అన్న౦ బలాన్ని హరిస్తు౦దనీ ఎ౦డిపోయిన అన్న౦ అజీర్తిని కలిగిస్తు౦దనీ, అతిగా ఉడికినదీ, అతిగా వేగినదీ, నల్లగా మాడినదీ అపకార౦ చేస్తాయనీ, సరిగా ఉడకనిది జీర్ణకోశానికి హాని కలిగిస్తు౦దనీ, అతి ద్రవ౦గా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకొ౦టే దగ్గు జలుబు, ఆయాస౦ వస్తాయనీ, దేహ కా౦తిని, బలాన్ని హరిస్తాయని మలబద్ధత కలిగిస్తాయనీ ఉ౦ది. వీటికి భిన్న౦గా, చల్ది అ౦టే, మజ్జిగ అన్న౦ అమీబియాసిస్(గ్రహణీ వ్యాధి), పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధు లన్ని౦టినీ తగ్గి౦చగలిగేదిగా ఉ౦టు౦దనీ, బలకర౦ అనీ. రక్తాన్ని, జీర్ణ శక్తినీ పె౦చుతు౦దనీ ఈ గ్ర౦థ౦ పేర్కొ౦టో౦ది. బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వర౦తో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉ౦టు౦దని కూడా అ౦దులో ఉ౦ది. ఈ చల్లన్నాన్ని మూడు రకాలుగా చేసుకోవచ్చు.

1. ఆ పూట వ౦డిన అన్న౦లో మజ్జిగ పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ మజ్జిగలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు మజ్జిగ చుక్కలు వేస్తే, తెల్లవారేసరికి ఆ అన్న౦ మొత్త౦ తోడుకొని పెరుగులాగా అవుతు౦ది. ఈ తోడన్న౦ లేదా పెరుగన్నానికి తాలి౦పు పెట్టుకోవట౦, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లా౦టివి కలుపుకోవట౦ చేయవచ్చు.
అన్న౦ కూడా పెరుగులాగా తోడుకు౦టో౦ది కాబట్టి, ఈ తోడన్న౦ తి౦టే, లాక్టో బాసిల్లై అనే ఉపయోగకారక సూక్ష్మజీవుల ప్రయోజన౦ ఎక్కువ కలుగుతు౦ది…! అయితే, మజ్జిగలో నానబెట్టినది దానికన్నా చాలా తేలికగా అరిగేదిగా ఉ౦టు౦ది. అప్పటికప్పుడు అన్న౦లో మజ్జిగ కలుపుకున్న దానికన్నా రాత్ర౦తా మజ్జిగలో నానిన అన్న౦లో సుగుణాలు ఎక్కువగా ఉ౦టాయి.
ధనియాలూ, జీలకర్ర, శొ౦ఠి ఈ మూడి౦టినీ సమాన౦గా తీసుకొని మెత్తగా ద౦చి, తగిన౦త ఉప్పు కలుపుకొని ఒక సీసాలో భద్ర పరచుకో౦డి. ఒకటి లేక రె౦డు చె౦చాల పొడిని తీసుకొని తోడన్న౦ లేదా చల్లన్న౦ న౦జుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉ౦టాయి.

ఎదిగే పిల్లలకు ఇది గొప్ప పౌష్టికాహార౦. బక్క చిక్కి పోతున్నవారు తోడన్నాన్ని . స్థూలకాయులు చల్లలో నానిన అన్నాన్ని తినడ౦ మ౦చిది. రక్త పుష్టికి ఇ౦తకన్నా మెరుగైన ఆహార పదార్థ౦లేదు. రాత్రి బాగా ప్రొద్దుపోయిన తర్వాత తోడేసి, ప్రొద్దున్నే సాధ్యమైన౦త పె౦దరాళే తినాలి. ప్రొద్దెక్కేకొద్దీ పులిసి కొత్త సమస్యలు తెచ్చిపెడుతు౦ది.

చద్ది కథ ఇది! చద్దన్న౦ అని ఈసడి౦చక౦డి. అలా ఈసడి౦చట౦ మన అమాయకత్వానికి మాత్రమే సఒకేత౦ అని గమని౦చాలి. ఏమాత్ర౦ పోషక విలువలు లేని టిఫిన్లు పెట్టి పిల్లలను బలహీనులుగా పె౦చక౦డి. చద్ది పెట్ట౦డి. బల స౦పన్నులౌతారు, శారీరిక౦గానూ, మానసిక౦గా కూడా! తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

భగవద్గీతలో ఈ శ్లోకాలు డీకోడ్ చేసుకుంటే చాలు.. మీ బిజినెస్ బిందాస్..!!

మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? కన్ ఫ్యూజన్ లేకుండా భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతకంటే పెద్ద సెంటెన్సులు లేవు. కొందరు అనుకున్నట్టుగా, భగవద్గీత ఎట్టిపరిస్థితుల్లో మతగ్రంథం కానే కాదు. కురుక్షేత్ర సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత. అందరూ చచ్చిపోతారనే బాధ. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి- శ్రీకృష్ణుడు విడమరిచి చెప్పిన సారాంశమే భగవద్గీత.

బేసిగ్గా ఒక సినిమా పాట-మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ-ఆర్నెల్లకు పాచిపోతుంది. ఒక నవల-ఏడాది తర్వాత కనుమరుగైపోతుంది. కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక గ్రంథం – ఇగిరిపోని గంధం- భగవద్గీత. ఇదేదో మతోద్బోధ అనుకునే వాళ్ల మైండ్ సెట్ మార్చలేం.

ఆధ్యాత్మిక ప్రవచనమైనా, వ్యాపార సూక్తులైనా, మేనేజ్మెంట్ కోర్సులైనా, వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులైనా, ఆటలో గెలవాలన్నా, పరీక్షలో పాస్ కావాలన్నా, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్నా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో గీతను కోట్ చేస్తాం. గీత గురించి చర్చిస్తాం. ఆది శంకరాచార్య దగ్గర్నుంచి స్వామీ వివేకానంద, మాక్స్ ముల్లర్ దాకా భగవద్గీత గొప్పదనాన్ని వేనోళ్లా చాటినవారే.

సపోజ్- వ్యాపారమే తీసుకుందాం. అందులో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? బిజినెస్ గురించి దిగ్గజాలంతా చెప్పిన సూత్రాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అర్జెంటుగా గూగుల్ లో వెతకుతాం. అంతేగానీ మనకు ఇన్ బిల్ట్ ఉన్న మేథోవారసత్వాన్ని పట్టించుకోం.

ఇక్కడ సమస్య అదే. ఒక మంచిమాట తెలుసుకోడానికి టెక్నాలజీ మీద ఆధారపడతాం కానీ- వారసత్వ మూలల్లోకి ఎందుకు వెళ్లం? సార్వజనీన సత్యాలను సెర్చింజన్ లో దేవులాడుతాం కానీ- పుస్తకాల్లోంచి ఎందుకు కోట్ చేసుకోం? మనకు ఎన్నో గొప్పగొప్ప గ్రంధాలున్నాయి. (మతపరమైనవి కావొచ్చు, కాకపోవచ్చు) వాటిద్వారా నాలెడ్జ్ ఎందుకు సమపార్జించుకోం?

ఇందాక, పైన పేర్కొన్నట్టు భగవద్గీత ఉంది. అది ఒక్క మనకే కాదు. యావత్ ప్రపంచానికీ ఆ బుక్ యాక్సెస్ అవుతుంది. ఎన్నటికీ తరగని మేథో నిధి ఆ గ్రంథం. వందల శ్లోకాలు ఔపోసన పట్టాల్సిన పనిలేదు. బట్టీ పట్టి కంఠశోష తెచ్చుకోమనడం లేదు. ఒక నాలుగైదు శ్లోకాలు చాలు. అవి డీకోడ్ చేసుకుంటే బస్. వ్యాపారం మూడు పువ్వులు – ముప్పై ఆరు కాయలవుతుంది. నమ్మబుద్ది కావడం లేదు కదా. అయితే ఒక్కసారి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మ ఫలహేతుర్భూ: మాతే సంగోఅస్త్వకర్మణి ||
అంటే, నువ్వు కర్మలు చేయడానికి మాత్రమే. ఆ కర్మఫలాలకు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో ఎట్టిపరిస్థితుల్లో కర్మలు చేయకు. అలాగని చేయడం మానకు అని అర్ధం.

ప్రతీ ఆంట్రప్రెన్యూర్ కు ఈ శ్లోకం వర్తిస్తుంది. చేయాల్సిన పని గురించి రెండే రెండు ముక్కల్లో నిక్షిప్తమైన సార్వజనీన సత్యం ఇది. ప్రతీ వ్యాపారి ఇదే సూత్రం మీద పనిచేయాలి. ప్రతిఫలం గురించి ఆశించకుండా చేసుకుంటూ పోవడమే. ప్రాసెస్ ఎంజాయ్ చేసుకుంటూ తీరం చేరుకోవాలే తప్ప.. ఎంతసేపూ ఫైనల్ ఔట్ పుట్ మీదనే ఏకాగ్రత చేయొద్దు. అలా అని పూర్తిగా ఆశావాదం లేకుండా పనిచేయమని కాదు. ఆశ పడటం తప్పు కూడా కాదు. కానీ ఎలాంటి చర్యా లేకుండా- గాల్లో దీపం పెట్టే దేవుడా నీవే దిక్కు అంటే మాత్రం కష్టం. చేయాల్సింది చేయాలి. ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి. అంతేకానీ అమ్మో అని భయపడి మధ్యలోనే జారుకుంటే ఎన్నటికీ గమ్యం ముద్దాడలేం.

వాసంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ||
అంటే,”చిరిగిపోయిన బట్టలను పడేసి, మనం కొత్తబట్టలు ఎలా కట్టుకుంటామో, జీర్ణమైన శరీరాన్ని వదిలిన ఆత్మ కూడా- మరోకొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది” అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు కూడా అంతే. వెర్సటాలిటీ చూపించాలి. దేన్నయినా స్వీకరించేలా ఉండాలి. అవే సక్సెస్ రుచి చూపిస్తాయి. ముఖ్యంగా మార్పును ఎప్పటికప్పుడూ గమనించాలి. కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి. నా ఇష్టం- నాకు ఇదే ఇష్టం అంటే- వాళ్లు అక్కడే ఉండి పోతారు. అలా కాకుండా కొత్తదాని కోసం అన్వేషించాలి. కొత్తదనాన్ని చదివేయాలి. కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలి. అదే నిజమైన ఆంట్రప్రెన్యూర్ లక్షణం. బిజినెస్ అంటేనే నిరంతర ప్రయాణం. వ్యాపారి నిరంతర పథికుడు. నాలుగు గోడల మధ్యనే ఉంటే ప్రపంచం ఏనాటికీ అర్ధం కాదు. మొండిగా ఉండొద్దు. ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. సంకుచిత భావాలు వదిలేయాలి. స్పాంజి నీళ్లను పీల్చుకున్నట్టు అనుభవాల్ని పాఠాలుగా మలుచుకోవాలి. అప్పుడే గమనం వేగం అందుకుంటుంది.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్దినాశాత్‌ప్రణశ్యతి
అంటే, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మరుపుతో బుద్ధినాశనం, బుద్ధినాశనంతో మనిషే నాశనం.

ఇదొక యాంగర్ మేనేజ్‌మెంట్ లాంటిది. ఆంట్రప్రెన్యూర్లకు మస్టుగా ఉండాల్సిన లక్షణం. లేకుంటే చెప్పుడు మాటలు విని, వాస్తవాలతో పనిలేకుండా ఆలోచించి బుర్రపాడు చేసుకుంటారు. మైండ్ లో ఒకరకమైన కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దాంతో సహజంగానే మతిమరుపు వస్తుంది. ఆటోమేటిగ్గా లక్ష్యం నుంచి తప్పుకుంటాం. అందరిముందు నవ్వుల పాలవుతాం. అందుకే కోపాన్ని జయించాలి. టెంపర్ ని అదుపులో ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దు.

తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార |
ఆసక్తో హ్యాచరన్ కర్మ పర మాప్నోతి పూరుష: ||
కాబట్టి, చేసే పని, దాని ఫలితము మీద అదే పనిగా ఆసక్తి ఉండొద్దు. కర్మ ప్రకారం చేసుకుంటూ పోవాలంతే అంటాడు శ్రీకృష్ణ భ‌గ‌వానుడు

వ్యాపారమూ అంతే. ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. అవసరమైతే జత కలవాలి. బలం పెంచుకోవాలి. అత్యాశకు పోవద్దు. వీలైనంత క్రియేటవివ్ గా ఉండాలి. ఇన్నవేటివ్ గా ఆలోచించాలి. మార్కెట్ మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలి. అంతేగానీ బైనాక్యులర్ పట్టుకుని ఎలుకను వేటాడినట్టుగా ఉండొద్దు.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ|
యథోల్యేనావఈతో గర్భస్తథా తేనేదమావృతమూ ||
అంటే- పొగ చేత నిప్పు, ధూళి చేత అద్దం, మావి చేత గర్భస్త పిండం కప్పబడినట్లే, కోరికల చేత జ్ఞానం కూడా కప్పబడి వుంటుంది అని అర్ధం.

ఆంట్రప్రెన్యూర్లు వెతుక్కోవాలే గానీ ఇందులో బోలెడంత నిగూఢార్ధం దాగివుంది. కప్పేసే ప్రతీదీ మనల్ని మిస్ లీడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్.. ఒకచోట మంట అంటుకుంది అనుకుందాం. వెంటనే పొగ దాన్ని కప్పేస్తుంది. ఎదురుగా వుండే అద్దం మీద ధూళి- నిప్పును, పొగను రెండింటినీ దాచేస్తుంది. అంతులేని కోరికలు నాలెడ్జ్ ని కిల్ చేస్తాయి. అంతేకదా మరి.

ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గాలి. విచక్షణా జ్ఞాన‌మే వ్యాపారం.

తెలుగు నెలలు వాటి విశిస్టత

తెలుగు నెలలు (తెలుగు మాసములు) :తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.
ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:

1. శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం).

2. కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).

తెలుగు నెలలు

1. చైత్రము
2. వైశాఖము
3. జ్యేష్ఠము
4. ఆషాఢము
5. శ్రావణము
6. భాద్రపదము
7. ఆశ్వయుజము
8. కార్తీకము
9. మార్గశిరము
10. పుష్యము
11. మాఘము
12. ఫాల్గుణము

ఈ నెలల పేర్లు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కొక్క నెల ఏర్పడినట్లు సులభంగా గుర్తించవచ్చు.

* పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల చైత్రము .
* పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రం (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల వైశాఖము.
* పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం (అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల జ్యేష్ఠము .
* పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాషాఢా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆషాఢము.
* పౌర్ణమి రోజున శ్రవణం నక్షత్రం (అనగా చంద్రుడు శ్రవణం నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల శ్రావణము .
* పౌర్ణమి రోజున పూర్వాభాద్ర్హ నక్షత్రం (అనగా చంద్రుడు పూర్వాభాద్రా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల భాద్రపదము.
* పౌర్ణమి రోజున అశ్వని నక్షత్రం (అనగా చంద్రుడు అశ్వనీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఆశ్వయుజము.
* పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల కార్తీకము.
* పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రం (అనగా చంద్రుడు మృగశిరా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మార్గశిరము .
* పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రం (అనగా చంద్రుడు పుష్యమీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల పుష్యము.
* పౌర్ణమి రోజున మఖ నక్షత్రం (అనగా చంద్రుడు మఖా నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల మాఘము.
* పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి (ఉత్తర) నక్షత్రం (అనగా చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రం తో కలిసిన రోజు)అయితే ఆ నెల ఫాల్గుణము.

పై విలువని సూచించే పద్యం

క్రీ.శ. 950 ప్రాంతానికి చెందిన రెండవ ఆర్యభట్టు గణితంలో, జ్యోతిషంలో ఆరితేరినవాడు. ఖగోళ, గణిత శాస్త్రాల మీద ఇతడు ’మహాఆర్య సిద్ధాంతం’ అనే పుస్తకం రచించాడు. ఇందులో అక్షరాలతో, పద్యాలలో సంఖ్యలని వ్యక్తం చెయ్యడానికి ఇతడు ఓ చక్కని పద్ధతి సూచించాడు. దానికి “కటపయాది” పద్ధతి అని పేరు. ఈ పద్ధతిలో ప్రతీ హల్లుకి ఒక సంఖ్య విలువ ఈ విధంగా ఇవ్వబడుతుంది.

క, ట, ప, య = 1 ; ఖ, ఠ, ఫ, ర = 2
గ, డ, బ, ల = 3; ఘ, ఢ, భ, వ = 4
జ, ణ, మ, శ = 5; చ, త, ష = 6
ఛ, థ, స = 7; జ, ద, హ = 8
ఝ, ధ = 9; ఞ్, న = 0హల్లుకి, అచ్చు ఏది చేరినా హల్లు విలువ మారదు.
ఉదాహరణకి క, కా, కి, కీ, మొదలైన వాటన్నిటి విలువ 1 మాత్రమే.

ఈ పద్ధతి ప్రకారం ’పై’ విలువ ఈ కింది సంస్కృత పద్యంలో పొందుపరచబడి ఉంది.

గోపీ భాగ్య మధువ్రాత శృఞ్గి శోదరి సంధిగ
ఖల జీవిత ఖాతావగల హాలార సంధర ||

ఈ పద్యాన్ని కృష్ణుడి పరంగాను, శివుడి పరంగాను కూడా చెప్పుకోవచ్చట. సంస్కృతం తెలిసిన వారు కొంచెం ఈ పద్యం అర్థం (అర్థాలు) చెప్పగలరు.

కటపయాది పద్ధతిలో హల్లుల విలువలని పై పద్యంలో అక్షరాలకి వర్తింపజేస్తే వచ్చే సంఖ్య…

3141592653589793 (మొదటి పాదం)
2384626433832792 (రెండవ పాదం)(ఆధునిక ’పై’ విలువ (31 దశాంశ స్థానాల వరకు) =
3.1415926535897932384626433832795
http://ja0hxv.calico.jp/pai/epivalue.html
31 వ దశాంశ స్థానం లో మాత్రమే ఆధునిక విలువకి, ఆర్యభట్టు ఇచ్చిన విలువకి మధ్య తేడా ఉందని గమనించగలరు.)

వెయ్యేళ్ల క్రితం ’పై’ విలువని అన్ని దశాంశ స్థానాల వరకు లెక్కించగలడమే ఒక అద్భుతం! దానికి తోడు ఆ విలువని రెండు అర్థాలు వచ్చే పద్యంలో నిక్షిప్తం చెయ్యడం ఇంకా విచిత్రం!

ఆ పుస్తకంలో ఇలాంటి విశేషాలు ఎన్నో ఉన్నాయట.

మూలం:
ప్రఖ్యా సత్యనారాయణ శర్మ, “గణితభారతి: పరిశోధనాత్మక గ్రంథము” గోల్డెన్ పబ్లిషర్స్, హైదరాబాద్, 1991.

(మేం చిన్నప్పుడు ’పై’ విలువని గుర్తుంచుకోవడానికి ఓ mnemonic ని వాడేవాళ్లం.
May I have a large container of coffee.
(3. 1 4 1 5 9 2 6)

కాని పై పద్యం ముందు ఈ ’పై’ వాక్యం ఆటబొమ్మలా అనిపిస్తుంది.)