Wednesday, May 18, 2016

దశ దాన ఫలములు ........!!

గోదాన ఫలము:
గోవు అంగములందు పదునాలుగులోకాలు ఉన్నాయి. బాగా పాలు ఇచ్చేది, మంచి వయసులోనున్నది, దూడతోకూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు,కంచు మూపురము, రాగి తోక, నూతన వస్త్రములతో అలంకరించి, ఆ ఆవుతోపాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ, ఫల, దక్షిణ, తాంబూలములతో యథావిధిగా దానం చెయ్యాలి. గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి.  ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై, దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు.
భూదాన ఫలము:
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతూంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు.  సుక్షేత్రము, సమస్త సస్యసమృద్ధము అయిన భూమిని దానం చేయుటచేత అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై., దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
తిలదాన ఫలము:
తిలలు అంటే నువ్వులు.శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చెయ్యడంవలన సమస్త పాపములు నశిస్తాయి.ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై., దాతకు విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (సువర్ణ)దాన ఫలము:
హిరణ్యము అంటే బంగారం.బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై., దాతకు అగ్నిలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
ఆజ్య(నెయ్యి)దాన ఫలము:
ఆజ్యము అంటే ఆవునెయ్యి. ఈనెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకుఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వలన సకల యఙ్ఞఫలం లభిస్తుంది.ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై., దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
వస్త్రదాన ఫలము:
శీతోష్ణములనుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారినికే కాకుండా, మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వలన, సర్వ దేవతలు సంతోషించి,సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు.  ధాన్య దాన ఫలము. జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము. జీవిఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుట వలన, సకల దిక్పాలకులు సంతృప్తిచెంది, దాతకు ఇహలోకమందు సకలసౌఖ్యము అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు.
గుడ(బెల్లం)దాన ఫలము:
రుచులలో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుండి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకునకు, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంప్రీతులై., దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.
రజత(వెండి)దాన ఫలము:
అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివ,కేశవులు., పితృదేవతలు సంప్రీతులై.,దాతకు సర్వసంపదలను,వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.

లవణ(ఉప్పు)దాన ఫలము:
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈదానంతో మృత్యుదేవత సంప్రీతుడై.,దాతకు ఆయుర్దాయమును, బలాన్ని,ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.
ఇవి దశ దానాలు. ఈ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలం పదింతలు అవుతుంది. ఈ దానాలను భక్తి శ్రద్ధలతో చేయాలిగాని, దాన గ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నామనే భావనతో చేయరాదు. అలా చేస్తే ఫలితం శూన్యం అనే నిజాన్ని గుర్తించి మరీ దానం చేయవలయును.

No comments:

Post a Comment