Tuesday, May 17, 2016

ఆంజనేయునికి ఎంత ప్రీతి పాత్రమో ఈ “సింధూరం”.....!!



పూర్వం శ్రీరామ పట్టాభిషేకానంతరం ఒకనాడు సీతమ్మ తలంటే స్నానం చేసి నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం’ పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి పోవుచున్న సమయాన అప్పటి వరకు శ్రీరాముని సేవకై నిరీక్షించిన ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో” మేము విశ్రాంతి మందిరానికి పోతున్నాము, నీవు రాకూడదు, పొమ్ము హనుమా …. తరువాత రావచ్చును” అనెను. రాములవారు కూడా “సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా … ఇప్పుడు రావద్దు …” అనెను. అంతట ఆంజనేయుడు “రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా… మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులైపోతిరేమి రామా ” అనగా, రాములవారు హనుమంతునితో “నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరము పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని” అని తెలిపాడు.హనుమంతుడు ఆశ్చర్యముతో “అమ్మా! మీ నుదుట తిలకముంది కదా! పాపిటన సింధూరం దేనికి” అని అడిగాడు. అప్పుడు సీతాదేవి ‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని ” చెబుతుంది.వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందు లేకుండా పూసుకుని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా పక పక విరగబడి నవ్వుచుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ” హనుమా ! ఇదేమిటి” అని అడగగా, హనుమంతుడు “మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, చిటికేడుకే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరము మొత్తము సింధూరం అలంకరించుకున్నాను . మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కదా” అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా “ఆంజనేయా ! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధురాన్నితిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతేకాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి” అని వరదానం చేసాడు.ఆంజనేయునికి ఎంత ప్రీతి పాత్రమో ఈ “సింధూరం” చూశారా.! అందుకే హనుమకి సింధూరం పూయించి తరించండి.

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః


-----------------------------------------------------------
ఓం ఆం ఆంజనేయాయ నమః
శైలీ గదాధర నమార్జిత వజ్రకచ్చి
న్వామాంఘ్రీపీడిత మనోజ సులబ్ధకీర్తే
శ్రీరామదాస దృఢబుద్ధి మతాంవరిష్ఠ
శ్రీరామదూత సతతం హనుమన్నమస్తే

విప్రాదిజాతిక నికేతన కారిచాన
గ్రామాధివాస కృతథామవిశాలకీర్తే
శ్రీరామదాస దృడబుద్ధి మతాంవరిష్ఠ
శ్రీరామదూత సతతం హనుమన్నమస్తే
ఫల్గూనదీతట సముద్భవ జాతివృక్షే
ప్రసాదమండిత మనోహరవాస ధామ్ని
రూపం విభాతి కపిరాజ మనోహరం తే శ్రీరామదూత సతతం హనుమన్నమస్తే!
శ్రీరామ జయరామ జయజయ రామ రామ
-----------------------------------------------------------
శ్రీ మారుతీ స్తోత్రమ్....!!
"ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే

మోహ శోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోకవనాయస్తు దగ్థలంకాయవాజ్నినో
గతినిర్జితవాతాయ లక్ష్మణ ప్రాణ దయచ
వనోంకసాం వరిష్టాయ వశినే వనవాసినే
తత్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయనే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యుభయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్టాయ ప్రేత భూత పిశాచ భయహరిణే
యాతనా నాశనాయస్తు నమో మర్కటరూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్పవృచ్చిక భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీవి నహీద్ద్రతే
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్ధయే
బలినామగ్రగణ్యాయ నమోనమళః పాహిమారుతే
లాభదోసిత్వమేలాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయంచమేదేహి శతృన్ నాశాయనాశయ
స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం
హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!!
స్వాశ్రితానామ భయదం యఏవంస్తోతిమారుతిం
హావికుతోభవేత్తస్య సర్వత్రవిజయీ భవేత్!!"
-----------------------------------------------------------
ఆంజనేయ స్వామికి తమలపాకులకు ఉన్న అనుభంధం ….!!
అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం ……
ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కలుగు లాభాలు.
సీతమ్మతల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు, రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని రంచేసినవాడు, రామలక్ష్మణులు నీకు మిత్రులే కాని, వాలి పంపగా వచ్చినవారు కారని సుగ్రీవునికి శాంతిని కలుగచేసినవాడు, నీ అహంకారం, నీ పరదారాపేక్షే నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు శివాంశసంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగాను, వైశాఖ మాస బహుళ దశమి తిథి హనుమజ్జయంతిగాను పరాశర సంహిత తెలియచేస్తుంది. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేర్గాంచాడు
ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది.అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
మరో కథ ప్రకారం.. అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.
అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం ……
శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్తమృగశీర్షానక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయ. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షాదక్షత, మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి.
అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు ….
1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబందమైన పీడలు తొలగిపోతాయి.
3. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు.
5. వ్యాపారంలో చాల నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది.
6. ఏ వ్యక్తి అయితే హీనంగా చుడబడుతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది.
7. శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది
8. వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి.
9. సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.
10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం కలుగుతుంది.
11. వాద ప్రతివాదాల్లో స్వామిని ప్రార్ధించిచి తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.

No comments:

Post a Comment