Wednesday, May 25, 2016

కోరి వండేద్దాం..కొర్రలు!

కోరి వండేద్దాం..కొర్రలు!
కొర్రలు.. చిరుధాన్యాల్లో ఒక రకం.. చాలామందికి దీంతో అన్నం వండుకోవడమే తెలుసు..అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వీటిని మరెన్నో రకాలుగా కూడా వండవచ్చు. పీచుతోపాటూ, యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందించి.. రక్తంలో చక్కెరస్థాయుల్ని సమతూకంలో ఉంచే కొర్రలతో.. ఇంకేమేం చేసుకోవచ్చో చూద్దాం.

పులిహోర
 కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు, ఆవాలు - పావుచెంచా, జీలకర్ర - అరచెంచా, సెనగపప్పు - ఒకటిన్నర చెంచా, ఎండుమిర్చి - తొమ్మిది, పచ్చిమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెబ్బలు, నూనె - అరకప్పు, పసుపు - పావుచెంచా, ఉప్పు - తగినంత, జీడిపప్పు పల్లీలు - రెండూ కలిపి పావుకప్పు, నిమ్మరసం - పావుకప్పు.
తయారీ: పొడిగా వండిన కొర్ర అన్నాన్ని ఓ పళ్లెంలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. అందులో ఉప్పూ, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా, సెనగపప్పూ, ఎండుమిర్చీ, పల్లీలూ, జీడిపప్పు వేయించుకోవాలి. అవి వేగాక పసుపూ, కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ వేయించుకుని పొయ్యి కట్టేయాలి. ఈ తాలింపు కొద్దిగా చల్లగా అయ్యాక కొర్ర అన్నంలో వేసి కలిపితే సరిపోతుంది. కొర్ర పులిహోర సిద్ధం.
టొమాటో రైస్‌
కావల్సినవి: కొర్రల అన్నం - పది కప్పులు (హోటళ్లలో సాంబారు వడ్డించే చిన్న కప్పుతో కొలుచుకోవాలి), నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయముక్కలు - ముప్పావు కప్పు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు - రెండున్నర కప్పులు, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు -తగినంత, అల్లంవెల్లుల్లి మిశ్రమం ముద్ద - అరచెంచా, కారం - చెంచా, నీళ్లు - రెండు కప్పులు.
తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, కొంత ఉప్పూ, కారం వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని వేయించాలి. అందులో టొమాటో ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి.అప్పుడు నీళ్లూ, మిగిలిన ఉప్పు చేర్చి మంట తగ్గించాలి. అవి ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండునిమిషాలయ్యాక దింపేస్తే చాలు.
కొబ్బరి పాలతో...
 కావల్సినవి: వండిన కొర్రల అన్నం - పది కప్పులు, నూనె, నెయ్యి - పావు కప్పు చొప్పున, లవంగాలు - మూడు, దాల్చినచెక్క - అంగుళం చొప్పున మూడు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు - ముప్పావు కప్పు, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - కప్పు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, కొబ్బరిపాలు - రెండున్నర కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద - అర చెంచా.
తయారీ: బాణలిలో నెయ్యి, నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అవి వేడయ్యాక లవంగాలూ, దాల్చినచెక్క ముక్కలూ వేయాలి. నిమిషం తరవాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, పావుచెంచా ఉప్పూ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చి వేయించాలి. అందులో పచ్చిబఠాణీ, క్యారెట్‌ ముక్కలు వేసి మంట తగ్గిస్తే.. కాసేపటికి అవి మగ్గుతాయి. అప్పుడు కొబ్బరిపాలూ, మరికొంచెం ఉప్పూ వేసి మంట తగ్గించాలి. ఒక్క పొంగు వచ్చాక ముందుగా వండి పెట్టుకున్న కొర్ర అన్నం వేసి మూత పెట్టేయాలి. ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు. అయితే మూడు నిమిషాల తరవాత మూత తీసి వడ్డించాలి.
పకోడి

కావల్సినవి: పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - కప్పు, జీలకర్ర - పావుచెంచా, అల్లంపచ్చిమిర్చి పేస్టు - పావుచెంచా, కొర్రపిండి, సెనగపిండి - అరకప్పు చొప్పున, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ: ఉల్లిపాయముక్కల్లో అల్లంపచ్చిమిర్చి పేస్టు వేసి కలపాలి. తరవాత వీటిపై నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పకోడీ గట్టిగా కావాలనుకుంటే.. పావు నుంచి అరకప్పు నీళ్లు చేరిస్తేచాలు. కాస్త మెత్తగా కావాలనుకుంటే కప్పు నీళ్లు పోసుకుని పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఈ పిండిని పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేగాక తీస్తే చాలు.
పాయసం

కావల్సినవి: పచ్చి కొర్రలు - రెండున్నర కప్పులు, బెల్లం - ఐదు కప్పులు, నీళ్లు - పదిహేను కప్పులు, నెయ్యి - కప్పు, జీడిపప్పు - అరకప్పు, కిస్‌మిస్‌ - పావుకప్పు, యాలకులపొడి - పావుచెంచా.
తయారీ: కొర్రల్ని అరగంటసేపు నానబెట్టుకోవాలి. తరవాత పొయ్యిమీదపెట్టి నీరుపోసి ఉడికించుకోవాలి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు బెల్లం వేసేయాలి. పది నుంచి పన్నెండు నిమిషాలకు బెల్లం కరిగి.. పాయసం కొద్దిగా చిక్కగా అయి, రంగు మారుతుంది. అప్పుడు నాలుగు చెంచాల నెయ్యి వేయాలి. పాయసం ఇంకాస్త ఉడికి.. దగ్గరవుతున్నప్పుడు మరో పొయ్యిమీద మిగిలిన నెయ్యి కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకులు వేయించుకోవాలి. తరవాత దీన్ని పాయసంలో వేసి, యాలకులపొడి చేర్చి దింపేయాలి.

No comments:

Post a Comment